నూరు శాతం పూర్తయిన గ్నోమ్‌ తెలుగీకరణ

Date

కంప్యూటర్ విజ్ఞాన సర్వస్వంలో తెలుగు మరో మైలు రాయిని దాటింది. కంప్యూటర్ని పూర్తిగా తెలుగులో వాడుకోవడానికి, నూరు శాతం తెలుగీకరణ పూర్తయింది. గత కొన్ని సంవత్సరాలుగా స్వేచ్ఛ సంస్థతో పాటు అనేక మంది వ్యక్తుల వ్యక్తిగత సహకారంతో చేసిన కృషి వలన, ఇప్పటి వరకు కంప్యూటర్లో చేయదగిన అన్ని పనులను ఇంగ్లీషు వంటి  ఇతర భాషలలోనే కాకుండా పూర్తిగా తెలుగులో నూ చేయవచ్చు.

     ప్రతి ఆపరేటింగ్ వ్యవస్థ (ఆపరేటింగ్ సిస్టం)లోనూ వినియోగదారుడు (యూజర్) సాఫ్ట్వేర్లను, ఇతర సాఫ్ట్వేర్  పరికరాలను వాడుకోవడానికి గల యూజర్ ఇంటర్ఫేస్ ఇప్పటి వరకు ఇంగ్లీషు లోనే ఉంది. కాని ఇప్పుడు గ్నూ/లైనక్స్ ఆపరేటింగ్ వ్యవస్థలో గ్నోమ్‌ డెస్క్ టాప్ ఆవరణం ఇక నుండి  పూర్తిగా తెలుగులోనే వాడుకోవడానికి అనుగుణంగా అభివృధ్ధి చేయబడింది. గ్నూ/లైనక్స్ ఆపరేటింగ్ వ్యవస్థ గ్నూ ప్రోజెక్ట్ లో భాగంగా ఉండటం మూలంగాను మరియు యూనీకోడ్ కు మద్దతు ఉండటం వలననే కంప్యూటర్ ను ఆయా స్థానిక భాషలలో మార్చుకోవడానికి మరియు వాడుకోవడానికి అనుకూలంగా ఉంది. సాధారణ కంప్యూటర్ వినియోగదారుల కోసం, విజ్ఞాన అభివృధ్ధి కోసం జి పి ఎల్ లైసెన్స్ తో గ్నూ ప్రోజెక్టు సహాయపడుతోంది. ఇందువల్ల ఎంతో వ్యయం ఆదా అవుతుంది. అదే ఇతర ప్రొప్రయిటరీ సాఫ్ట్వేర్ ల వలన లక్షల రూపాయల ధనం వెచ్చించాల్సి వస్తుంది.

     స్వేచ్ఛ కృషి:  ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ లో భాగంగా2001 లో మొదటగా తెలుగులో స్థానికీకరణకు స్వేచ్ఛ సంస్థ నాంది పలికింది. గ త దశాబ్ద కాలంగా అనేక అడ్డంకులను అధిగమించి అనేక మంది సహాయంతో, ఒక యజ్ఞంలా భావించి నేటికి నూరు శాతం తెలుగు స్థానికీకరణను పూర్తిచేయగలిగారు. అంతే కాక తెలుగులో గ్నూ/లైనెక్సు ఆధారిత 'స్వేచ్ఛ' ఆపరేటింగ్ వ్యవస్థను రూపొందించారు. ఈ ఆపరేటింగ్ వ్యవస్థ స్వతంత్ర సాఫ్ట్వేర్ లైసెన్స్ ను కలిగి ఉండటంతో వలన ఎవరైనా ఉచితంగా వాడుకొన వచ్చును. అభివృధ్ధి చేయవచ్చు, వారి అవసరాలకణుగుణంగా మార్పులు కూడా చేసుకొన వచ్చును. ఇతర ఏ విధమైన సాఫ్ట్వేర్లు అవసరం లేకుండానే నేరుగా కంప్యూటర్లో తెలుగులో టైపు చేసుకొన వచ్చును. ప్రస్తుతం లభ్యమగుచున్న ఐదు రకాల కీబోర్డులు ఇందులో ఉన్నవి. వివిధ రకాల ఫాంట్లు కూడా వాడుకొనే సదుపాయం ఉన్నది. మరిన్ని వివరాలకు www.swecha.org ను సంప్రదించవచ్చును. ఈ మహోన్నత కార్యక్రమంలో అనేక మంది వాలంటీర్లు, భాషాభిమానులు, పాలసి మేకర్లు సాఫ్ట్వేర్‌ నిపుణులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు, విద్యార్థులు మరియు వివిధ వర్గాలకు చెందిన వారు ఇందులో పాల్గొని ఉన్నారు.

     ఇటీవలి గణాంకాల ప్రకారం  దేశంలో  30ఏళ్ళలోపు యువకులు 60 శాతం ఉన్నప్పటికీ  కేవలం 7 శాతం మందికే కంప్యూటర్ తెలుసు. దీనికి భాష ముఖ్య కారణం . గ్రామీణ ప్రాంత విద్యార్థులకు,రైతులకు, ప్రభుత్వ దైనిందిన కార్యక్రమాలకు తెలుగులో కంప్యూటర్ ఎంతో ఉపకారం చేస్తుంది. మాతృభాషలో కంప్యూటర్ ని వాడుకోగలిగితే ఇ-అక్షరాస్యతను మరింత పెంపొందించుకోవచ్చు. ఈ విషయాన్ని ఆకళింపు చేసుకున్న  స్వేచ్ఛ   2005 లో‌  కోడింగ్ ప్రక్రియను పూర్తి చేసి అప్పటి ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా తొలి తెలుగు ఆపరేటింగ్ వ్యవస్థను విడుదల చేసారు. ఆ తర్వాత పలు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థుల సహకారంతో 2006 లో‌ నలభై వేల లైనుల కోడ్ ను తెలుగీకరించి రెండోవెర్షన్ ను విడుదల చేసారు. ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లు స్వేచ్ఛ దిన దిన ప్రవర్థమానం చెందింది. ప్రస్తుతం వేల మంది యువకులు ఇందులో ఉన్నారు. ఎన్నారైలు కూడా తమవంతు పాత్ర వహిస్తున్నారు. ఈ విధంగా తెలుగు స్థానికీకరణకు భగీరధుని కృషి చేస్తూ నూరు శాతం తెలుగు కంప్యూటర్ నేడు సాకారమైంది.