పెగసెస్ వెనక భయంకర నిజాలు

పెగసెస్ ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతున్న పేరు. ఛాలామందికి ఇదేంటో అర్ధం కాలేదు. ఇదేదో బిజెపి, కాంగ్రెస్ కొట్టుకోవడానికి వచ్చిన కొత్త సబ్జెక్ట్ అనుకుంటున్నారు. ఈ పెగసెస్ వివాదం ఎంత పెద్దదో.. అది ఎంత డేంజరస్ అనేది ఇంకా తెలియటం లేదు. ఐటీ, సాఫ్ట్ వేర్ విషయాలు తెలియనివాళ్లు దీనిని చాలా లైట్ తీసుకుంటున్నారు. కాని అసలు పెగసెస్ ఏంటి? మన దేశంతో దాని లింకేంటి? ఇక్కడ ఏం జరిగిందని ఇప్పుడు గొడవ జరుగుతుంది? అన్ని విషయాలు మనతో సవివరంగా పంచుకున్నారు ఐటీ నిపుణులు, ఆలిండియా జనరల్ సెక్రటరీ, ఫ్రీ సాఫ్ట్ వేర్ మూమెంట్ ఆఫ్ ఇండియా వై.కిరణ్ చంద్ర.

ప్ర: అసలేంటీ పెగసెస్? ఎవరు తయారు చేశారు? అంత పవర్ ఫుల్ అది? ప్రపంచ దేశాలు ఎగబడి కొనుక్కునేంత ఏముంది దాంట్లో?
జ: ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్ లిమిటెడ్ (Niv, Shalev and Omri.. ఈ సంస్థ వ్యవస్ధాపకుల పేర్లు.. వారి పేరు మీదే కంపెనీ ఉంది) ఈ పెగసెస్ అనే సాఫ్ట్ వేర్ ని డెవలప్ చేసింది. అమెరికా, ఇతర దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో వీరికి గట్టి సంబంధాలే ఉన్నాయి. సైబర్ వెపన్స్ చేయడంలో తాము ఎక్స్ పర్ట్స్ వారి వెబ్ సైట్ లో చెప్పుకుంటారు. ఇంటర్నెట్ వేదికగా సైబర్ వెపన్స్ ప్రయోగించడమే వీళ్ల పని. వీరు తయారు చేసిన పెగసెస్ అనే సైబర్ వెపన్ ప్రభుత్వాలకు, ప్రభుత్వ సంస్థలకు అమ్ముతున్నారు. ఇది ఎవరి మొబైల్ లోకి అయినా.. ఎవరి కంప్యూటర్ లోకి అయినా యూజర్ కి తెలియకుండానే ఎంటరైపోతుంది. మొన్నటివరకు ఏదో లింక్ క్లిక్ చేస్తేనే వస్తుందన్నారు. అసలు విషయం ఏంటంటే లింక్ కూడా అవసరం లేదు. ఇంటర్ నెట్ తో కనెక్ట్ అయితే చాలు.. అది మన ఇంట్లోకి వచ్చినంత ఈజీగా వచ్చేస్తుంది. వచ్చాక మన ఫోటోలు, మన డేటా, మన మెయిల్స్, మన చాటింగ్ అన్నీ తెలుసుకుంటుంది. ఆఖరికి మనం కీవర్డ్స్ ద్వారా పంపుకునే కమ్యూనికేషన్స్ కూడా డీకోడ్ చేసేసుకుంటుంది. మనం చేసే యాక్టివిటీ మొత్తం వారికి తెలిసిపోతుంది. లేటెస్టుగా యూరప్ కు చెందిన ఓ సంస్థ మరికొందరు ఈ పెగసెస్ ద్వారా 50 వేల మంది ఫోన్లను హ్యాక్ చేశారని.. అందులో 300 నెంబర్లు ఇండియావారివేనని.. అందులో రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్, ఇంకా న్యాయమూర్తులు చాలామంది ఉన్నారని కథనాలు వచ్చాయి. ది వైర్ వెబ్ సైట్ ఈ సంచలన కథనాన్ని ప్రచురించింది. దీంతో పార్లమెంటులో దీనిపై బిజెపి, ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తోంది. ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ జరగలేదని చెబుతోంది.

ప్ర: ఎన్ఎస్ఓ గ్రూప్ తాము ఈ పెగసెస్ ను కేవలం ప్రభుత్వాలకు, ప్రభుత్వ సంస్ధలకు మాత్రమే అమ్ముతామని చెబుతోంది? నిజమేనా? భారత ప్రభుత్వం దీనిని కొనుగోలు చేసిందా?
జ: ఆ సంస్థ చెబుతున్నది అదే. ప్రభుత్వాలకు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే ఇస్తానంటోంది. అంతేకాదు అదికారికంగా వారొక కండిషన్ కూడా పెట్టారు. దీనిని కేవలం ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి మాత్రమే వాడాలని. కాని మన దేశంలో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ప్రభుత్వం మీద విమర్శలు చేసేవారి మీద ప్రయోగించారని ఆరోపణలు గట్టిగా వినపడుతున్నాయి. కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా నడుస్తున్న యాక్టివిటీస్, వ్యూహాలను తెలుసుకుని.. ప్రభుత్వ వ్యతిరేకత పెరగకుండా ఉండేలా దీనిని వాడుకున్నారనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. పది నుంచి 50 ఫోన్లవరకు హ్యాక్ చేయడానికి అవసరమైన సాఫ్ట్ వేర్ కేవలం 60 కోట్ల రూపాయలతో వచ్చేస్తుంది. కేంద్ర మంత్రులు పార్లమెంట్లో సమాధానం చెప్పేటప్పుడు కొనలేదని చెప్పలేదు.. కొన్నామనీ చెప్పలేదు. ఏదైనా కొనే హక్కు ఉందని మాత్రం చెప్పారు. దీనిపై ఏ సమాచారం అడిగినా భద్రతా కారణాల రీత్యా చెప్పలేమంటారు. కాని వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత ప్రమాదంలో పడ్డాయని మాత్రం ఖచ్చితంగా మనం అనుకోవచ్చు.

ప్ర: రెండేళ్ల క్రితమే పార్లమెంట్లో ఫోన్ ట్యాపింగ్ పై చర్చ జరిగింది.అప్పుడు కూడా అధికార బిజెపి ట్యాపింగ్ చేయలేదని చెప్పింది గాని.. పెగసెస్ తీసుకోలేదని మాత్రం చెప్పలేదు.. ఏంటి దానర్ధం:?
జ: ట్యాపింగ్ వేరు.. హ్యాకింగ్ వేరు. ఫోన్ ట్యాప్ చేస్తే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే అంశాల వరకు మాత్రమే తెలుస్తాయి. పెగసెస్ సంగతి వేరు. దీని ద్వారా హ్యాక్ చేస్తే.. మొత్తం సమాచారమే వారికి వెళ్లిపోతుంది. నేను తెరిచిన పుస్తకం అంటారు కదా జనరల్ గా… ఇక్కడ మెగసెస్ ఎంటరైతే మన జీవితం చించిన పుస్తకం అయిపోతుంది. ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం..ఎవరికి మెయిల్ చేస్తున్నాం.. ఏ వీడియోలు చూస్తున్నాం.. ఏ న్యూస్ ఎక్కువగా ఫాలో అవుతున్నాం.. ఫేస్ బుక్ లో ఎలాంటి కామెంట్స్ పెడుతున్నాం.. మొత్తం మన ఆలోచనాధోరణిని ట్రాక్ చేసేస్తారు. ప్రభుత్వం ఏమీ చెప్పటం లేదు. కాని ఇప్పుడు ఆ లిస్టులో నెంబర్లున్నవారు తమ మొబైల్స్ చెక్ చేయించుకుంటే మెగసెస్ ఎంటరైందీ లేనిదీ తెలిసిపోతుంది. అప్పుడు నిజం ఎవరూ దాయలేరు.

ప్ర: 2019 ఎన్నికల టైమ్ లో బిజెపి పెగెసెస్ ను వాడుకుందనే ఆరోపణల్లో నిజమెంత?
జ: బిజెపికి ఫేస్ బుక్ తో ఉన్న అసోసియేషన్ పై ఎంక్వయిరీ చేసిన, బిజెపిని ఎన్నికల నిబంధనల విషయంలో ప్రశ్నించిన ఎన్నికల కమిషన్ అధికారులు, సోషల్ వర్కర్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు. బిజెపి అప్పటికి అధికారంలో ఉంది కాబట్టి.. మెగసెస్ కొని ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. అయితే రాజకీయ పార్టీగా బిజెపి వాడుకున్నదనే దానిపై ఇప్పటికైతే ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ వాడుకుని ఉంటే..అది ఇప్పుడు ఖచ్చితంగా బయటపడుతుంది.

ప్ర: టెక్నికల్ పెగసెస్ ను ఎదుర్కోలేమా?
జ: ఇది ఒక విధంగా జరుగుతున్న దొంగతనాన్ని ఆపడం లాంటిదే. పెగసెస్ సాఫ్ట్ వేర్ యూఎస్ మొబైల్ నంబర్ల మీద పని చేయదు. +1 సిరీస్ తో ప్రారంభమయ్యే అమెరికా నెంబర్లను ఈ సాఫ్ట్ వేర్ హ్యాక్ చేయలేదు. ఎందుకంటే అమెరికాలో వ్యక్తిగత గోప్యతా హక్కులకు సంబంధించిన చట్టాలు అంత బలంగా ఉంటాయి. మనకు అలాంటి చట్టాలు లేవు. గతంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ మంచి సిఫార్సులు చేసినా వాటిని పట్టించుకోలేదు. పార్లమెంట్లో ఇప్పటివరకు పెట్టిన, పెట్టబోతున్న బిల్లులు ఏమీ పనికిరావు. 66ఎ లాగానే ఉంటాయి.. సుప్రీంకోర్టు వద్దన్నా ఆ సెక్షన్ కింద కేసులు పెట్టినట్లే ఉంటుంది వాటితో వ్యవహారం. పెగసెస్ లాంటి సాఫ్ట్ వేర్ లను అమెరికన్ ఏజెన్సీలు ఎన్ఎస్ఏ, సీఐఏలు 5వేలకు పైగా తయారు చేశాయని వికీలీక్స్ లో బయటపెట్టారు. అంటే మన డేటా ప్రొటెక్షన్ లా ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో అర్ధం చేసుకోండి.

పెగసెస్ వెనక భయంకర నిజాలు