9, ఫిబ్రవరి-2005 స్వేచ్ఛ ఆపరేటింగ్ సిస్టం విడుదల చేసిన రోజు!
ఈ సహస్రాబ్ది ప్రారంభనాళ్ళలో యావత్ చదువుకున్న యువత చూపు కంప్యుటర్ వైపుగానే!
కంప్యూటర్ ప్రతి ఉత్పత్తి క్రమంలో అనుసంధానమవుతున్న దశ!
ఉద్యోగ ఉపాధి అవకాశాలలో సైతం కంప్యూటర్ విజ్ఞానంలోని నిష్ణతే వారి వారి వేతనాలను నిర్ణయించేది! కంప్యుటర్ అనగానే ఇంగ్లీషు, ఇంగ్లీషు రాకపోతే కంప్యూటర్ మీద పని చేసే అవకాశమే లేని స్థితి!

2000 సం నాటికి ఉమ్మడి రాష్టృంలో అక్షరాస్యత 60.47% ఇంగ్లీషు వచ్చిన వారు 10% లోపే! జనాభాలోని 90% మంది కంప్యుటర్ వినియోగానికి చేరువ కావాలంటే అది మాతృ భాషలోనే అందుబాటులో ఉండాలి! ఈ దిశగా వేసిన అడుగులతోనే స్వేచ్ఛ రూపుదిద్దుకున్నది. తొలుత తెలుగులో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంకి పెట్టిన పేరు స్వేచ్ఛ, ముగ్గురితో మొదలయిన ప్రయత్నం, నేడు వేలాది మంది వలంటీర్లతో ఒక జీవ నదిలాగా ప్రయాణం కొనసాగిస్తున్నది!

భారతీయ భాషలలోని మొదటి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం తెలుగులోనే వెలవడింది! అదే -- స్వేచ్ఛ! తెలుగులో కంప్యూటర్ తయారీతో మోదలయిన ఈ ప్రయత్నం నేడు తెలుగులో ఏఐ వైపున వేగంగా అడుగులేస్తున్నది!
ఈ ప్రయాణం మొత్తంలో కీలకం--అకుంటిత దీక్షతో, కార్యోన్ముఖులై, అవిశ్రాంతంగా, నిస్వార్థంగా నడిచిన వలంటీర్లు! గత సంవత్సరం హైదరాబాదులో నిర్వహించిన ప్రఖ్యాత ఏఐ సదస్సులో ఆసియా పసిఫిక్ ఖండంలోని నిష్ణాతులలో ఎక్కువ మంది వక్తలుగా వచ్చారు! వీరిలో 80% వరకూ సేచ్ఛతో సంబంధం ఉన్నవారే!

జీవిత కాలం స్వేచ్ఛ లక్ష్యాలను ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో ఉన్నవారు మొదలుకోని, ఉపాధి చేసుకుంటూ పని చేస్తున్న వేలాది మంది తో సహా, నేను సైతం అని ఒక అడుగు.. వేసిన ప్రతి భాగస్వామినీ స్వేచ్ఛ అభినందిస్తున్నది.
"స్వేచ్ఛతో పయనం--నేను మనంగా జననం" అన్న నినాదంతో, సామాజిక ధృక్పథంతో, "నేను సైతం.... సమాజ హితంకోసం" అనే ప్రయాణంలో భాగస్వాములవ్వాలనుకున్న వారినందరినీ స్వేచ్ఛ ఆహ్వానిస్తున్నది.

ఈ 20 యేళ్ళ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను రానున్న రోజులలో సీరియల్‌గా ప్రచురించనున్నాము!
- కిరణ్ చంద్ర
fsmi.social | x.com